కింగ్‌ కోహ్లి ఈజ్‌ బ్యాక్‌..

దుబాయ్ ‌: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగుతున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి  ఖాతాలో మరో మణిహారం వచ్చి చేరింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఘోరంగా విపలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో దక్షిణాప్రికాపై డబుల్‌ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్‌ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. 



బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం అనంతరం నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్‌ స్మిత్‌.. ఆ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 774 పరుగులు రాబట్టి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అంతేకాకుండా అప్పటివరకు నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న కోహ్లిని పక్కకు నెట్టి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా పాక్‌ సిరీస్‌లో (4, 36) విఫలమైన స్మిత్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అయితే డిసెంబర్‌ 12 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో స్మిత్‌ రాణించినట్లయితే కొత్త సంవత్సరంలో ఆగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంది.