కరోనా కట్టడికోసం లాక్‌డౌన్ విధించడంతో చాలా పరిశ్రమలు నష్టపోయాయి. అయితే కొన్నింటికి మాత్రం లాక్‌డౌన్ కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ఫార్మా పరిశ్రమ లాంటివి అధికంగా లాభపడగా, అదే బాటలో ఆన్‌లైన్ గేమింగ్ కూడా దూసుకుపోతుంది. చాలా వరకు అందరూ ఇంటికే పరిమితం కావడంతో ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటానికే అందరూ మక్కువ చూపుతున్నారు. అయితే వీటిలో లూడో గేమ్ విశేష ఆదరణ పొందుతోంది. లాక్‌డౌన్ కాలంలో లూడో డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ఇప్పటి వరకు ఈ గేమ్‌ను దాదాపు 330 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా 50 మిలియన్ల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అంతకుముందు టెంపుల్‌రన్, కాండీక్రష్ గేమ్స్‌కి ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు లూడో కింగ్ కూడా అదే తరహాలో దూసుకుపోతుంది.
ఇంతలా ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడం పట్ల గేమ్ రూపొందించిన వికాస్ జైస్వల్‌లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తోన్నారు. ‘చాలా ఆన్‌లైన్ గేమ్స్ ఉన్నా భారతదేశ సంప్రదాయాలకు తగ్గట్టు లూడో, వైకుంఠపాళి, క్యారమ్స్ లాంటి గేమ్స్ ఆన్‌లైన్‌లో లేవు. అందుకే నేను అలాంటి గేమ్‌ని రూపొందించాలి అనుకున్నాను. లూడో కింగ్‌ని ఆ ఉద్దేశ్యంతోనే తయారు చేశాను. అందరిలాగానే మేము కూడా కరోనా ఎఫెక్ట్ మాపై ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాం. అయితే కొన్ని సార్లు మనం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. మా లూడో కింగ్‌కి ఈ లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింద’ని జైశ్వాల్ అన్నారు. అయితే లూడో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈ గేమ్‌లో ఉండే ఫీచర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.